Mogra Flower Information in Telugu మల్లిక (మల్లె) (వర్గీకరణ నామం: Jasminum /ˈjæsmᵻnəm/) పొదల ప్రజాతికి చెందిన, ఆలివ్ కుటుంబానికి (ఒలకేసి) చెందిన తీగలా పెరిగి సువాసనలిచ్చే పూలు పూసే మొక్క. ఉష్ణమండల, వెచ్చని ఉష్ణోగ్రతలు కలిగిన యూరేషియా, ఆస్ట్రేలియా, ఓసియానియా ప్రాంతాలలో పెరిగే సుమారు 200 జాతులు వున్నాయి. వేసవి రాగానే మల్లి మొగ్గల వాసన గుప్పు మంటుంది. ఇదే కుటుంబానికి చెందిన జాజి పూలు కూడా సువాసననిస్తాయి.
మల్లిక – Mogra Flower Information in Telugu
ఈ మొక్క ఆకురార్చే మొక్కగాగానీ (శరదృతువులో) లేదా పచ్చగా గానీ (సంవత్సరమంతా) నిలువుగా ద్రాక్ష తీగల వలెనే పైకి ప్రాకి వ్యాపించి ఉంటుంది. దీని పుష్పాలు సుమారు 2.5 సెం.మీ (0.93 అంగుళాలు) వ్యాసాన్ని కలిగి ఉంటాయి. ఇవి పసువు లేదా తెలుపు రంగులతో ఉంటాయి. కొన్ని పరిస్తితులలో అవి కొంచెం ఎరుపు రంగులో కూడా ఉంటాయి. ఈ పువ్వులు సైమోజ్ క్లస్టర్లలో మూడుపువ్వులుగా వ్యాపించి పుంటాయి. ప్రతీ పువ్వు సుమారు నాలుగు నుండి తొమ్మిది రేకులను కలిగి ఉంటుంది. మల్లెల్లో నలభై రకాలవరకు ఉంటాయి. అయితే మన రాష్ట్రంలో అధికంగా పందిరిమల్లె, తుప్పమల్లె, జాజిమల్లి, కాగడామల్లె, నిత్యమల్లెవంటివాటిని విరివిగా సాగుచేస్తుంటారు.
మల్లెలు మాఘ మాసంలో పూయటం మొదలుపెడతాయి. అందుకని వీటిని ‘మాఘ్యం’ అంటారు.
ప్రపంచవ్యాప్తంగా మల్లెల జాతులు చాలా ఉన్నప్పటికీ మనకు తెలిసిన మల్లె జాతి మాత్రం జాస్మినమ్ సంబక్ మాత్రమే. దీన్నే అరేబియన్ జాస్మిన్, మల్లిక, కుండమల్లిగై, మోగ్రా… ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు. పూలరేకులూ పరిమాణాన్ని బట్టి ఇందులోనూ రకాలున్నాయి. ఒకే వరుసలో ఐదు లేదా అంతకన్నా ఎక్కువ రేకలతో ఉండేదే మెయిడ్ ఆఫ్ ఓర్లియాన్స్. వీటినే రేక మల్లె, గుండు మల్లె అంటారు. గుండుమల్లెలానే ఉంటాయికానీ వాటికన్నా కాస్త బొద్దుగా ముద్దుగా ఉండేవే అరేబియన్ నైట్స్. కాడ సన్నగా ఉండి గుండ్రని మొగ్గల్లా ఉండే బొడ్డు మల్లెల్నే బెల్లె ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. వీటినే మైసూర్ మల్లెలనీ అంటారు. ఎండ తగులుతుంటే ఏడాది పొడవునా పూస్తుంటాయి. వీటిల్లోనే మరోరకం సన్నని పొడవాటి రేకలతో ఉంటుంది. దీన్ని బెల్లె ఆఫ్ ఇండియా ఎలాంగేటా అంటారు. చూడ్డానికి చిట్టి గులాబీల్లా ముద్దగా ఉండే రోజ్ జాస్మిన్ లేదా సెంటుమల్లె అనేది మరోరకం. ఇందులో రెండు రకాలు. గ్రాండ్ డ్యూక్ ఆఫ్ టస్కనీ, గ్రాండ్ డ్యూక్ ఆఫ్ సుప్రీమ్. పొడవాటి పొదగా పెరిగే ఈ రకాల్లో ఒకేచెట్టుకి ఒకే సమయంలో రకరకాల పరిమాణాల్లో పూలు పూస్తాయి. ఈ పూలు ఒక్కరోజుకే రాలిపోకుండా కొన్నిరోజులపాటు చెట్టుకే ఉండి సుగంధాలు వెదజల్లుతాయి. దొంతరమల్లె అనే మరో రకం ఉంది. ఇందులో పూరేకులు అరలుఅరలుగా అమరి ఉంటాయి. మాఘమాసంలో ఎక్కువగా పూసేదే జాస్మినమ్ మల్టీఫ్లోరమ్. మాఘ మల్లిక, స్టార్ జాస్మిన్ అని పిలిచే ఈ పూలు ఎక్కడా ఆకు అన్నది కనిపించకుండా పూసి మొక్క మొత్తం తెల్లగా కనిపిస్తుంది.
మల్లికను సంస్కృతంలో మల్ల లేదా మల్లి అంటారు. వసంతర్తువు ముగిసి గ్రీష్మ ఋతువు ఆరంభమవుతున్న సంధి సమయంలో పూస్తాయి కనుక ‘వార్షికి’ అంటారని, గ్రీష్మంలో విర్రవీగిన మల్లెలు శీతాకాలాన్ని చూస్తే భీరువులైపోతాయి కనుక ‘శీతభీరువు’ అంటారనీ అమర కోశం చెబుతోంది.
పాటలు
- మనసున మల్లెల మాలలూగెనే (మల్లీశ్వరి)
- ఇది మల్లెల వేళయని, ఇది వెన్నెల మాసమనీ (సుఖదుఃఖాలు)
- మల్లెపూల వాన జల్లుల్లోన (వినోదం)
- మల్లియలారా మాలికలారా (నిర్దోషి)
- మల్లె తీగవంటిది మగువ జీవితం (మీనా)
- మల్లె పందిరి నీడలోన జాబిల్లి (మాయదారి మల్లిగాడు)
- సిరిమల్లె నీవే విరి జల్లు తావే (పంతులమ్మ)
- మల్లెలు పూచే వెన్నెల కాచే ఈ రేయి హాయిగా (ఇంటింటి రామాయణం)
- మరుమల్లియ కన్న తెల్లనిది మకరందం కన్నా తీయనిది (మల్లెపూవు)
- తెల్లచీర కట్టుకున్నదెవరి కోసము మల్లెపూలు పెట్టుకున్నదెవరి కోసము (అంతస్తులు)
- మల్లెపూల మారాణికి (అమరజీవి)
- సిరిమల్లె పువ్వల్లే నవ్వు (జ్యోతి)
- మధుమాస వేళలో మరుమల్లె తోటలో (అందమె ఆనందం)
- మల్లె కన్న తెల్లన మా సీత మనసు (ఓ సీత కథ)